- అధికారిక విందులో ట్రంప్‌తో కేసీఆర్ కరచాలనం
- ఇవాంకా హైదరాబాద్ పర్యటనను గుర్తు చేసిన సీఎం
హైదరాబాద్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి ఇచ్చిన అధికారిక విందు కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పరిచయ కార్యక్రమంలో భాగంగా తన వద్దకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సీఎం కేసీఆర్ తొలుత చేతులు జోడించి నమస్కారం పెట్టారు.
తనను తాను పరిచయం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిగా ట్రంప్ చిరునవ్వు నవ్వుతూ 'అవును నాకు తెలుసు' అన్నట్లు సమాచారం. అనంతరం.. పక్కనే ఉన్న రాష్ట్రపతి కోవింద్, ట్రంప్ సతీమణి మెలానియాకు నమస్కారం పెట్టి, తర్వాత కరచాలనం చేశారు. కాగా, ట్రంప్ విందుకు ఆహ్వానించిన సమయంలోనే వెంట ఏమీ తీసుకురావద్దని రాష్ట్రపతి భవన్ స్పష్టంగా తెలియజేయటంతో సీఎం కేసీఆర్ తనతోపాటు ఏ కానుకలనూ తీసుకెళ్లలేదు.


